న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన సంస్థ టూవీలర్ తయారీదారు టీవీఎస్ మోటార్స్ లిమిటెడ్, ఐకానిక్ బ్రిటిష్ బైక్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ (యుకె) లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్ మోటార్స్ శుక్రవారం సాయంత్రం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీకి చెందిన సింగపూర్ అనుబంధ సంస్థ ఈ మేరకు నార్టన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నార్టన్‌కు చెందిన అన్ని ఆస్తులు, నార్టన్, దానికి సంబంధించిన అన్ని బ్రాండ్లను సోంతం చేసుకున్నామని వెల్లడించింది. ఈ డీల్ తమ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి, కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడానికి అపారమైన అవకాశాన్నిస్తుందని టీవీఎస్ మోటార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తెలిపారు. అంకితమైన వ్యాపార ప్రణాళికలతో నార్టన్ తన విలక్షణమైన గుర్తింపును నిలుపుకుంటుందని, బ్రిటిష్ కంపెనీ కస్టమర్లు, ఉద్యోగులతో టీవీఎస్ మోటార్ కలిసి పనిచేస్తుందన్నారు.
టీవీఎస్ చేతికి ఐకానిక్ బ్రిటిష్ బైక్ కంపెనీ