విజయనగరం అర్బన్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి బ్రేక్ పడనీయలేదు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. పాఠశాల విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నేరుగా తల్లిదండ్రులకు బియ్యం, గుడ్లు, చెక్కీలు పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో చేపట్టింది. ఈ బాధ్యతను ఆయా పాఠశాల పరిధిలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు, వలంటీర్లకు అప్పగించింది. సంబంధిత పాఠశాల హెచ్‌ఎం నుంచి విద్యార్థుల నమోదు సంఖ్యను తీసుకుని సచివాలయాల పరిధిలో ఉన్న వలంటీర్లు దగ్గరుండి అందజేయాలి. పంపిణీ పూర్తయిన వివరాలను సంబంధిత విద్యాశాఖ మధ్యాహ్న భోజన విభాగానికి ఎప్పటికప్పుడు పంపాలి.
ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ